కూటమి ప్రభుత్వంలో వరుస విద్యార్థుల మరణాలు : వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం
సెట్టూరులో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
అనంతపురం, ఆగస్టు 24: కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో పాడుబడిన గోడ కూలి దళిత విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందిన ఘటనపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వార్డెన్ నిర్లక్ష్యం, సంబంధిత డి.డి. పర్యవేక్షణ లోపం, కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.
విద్యార్థుల సమస్యలు, హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులు, మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాలను గుర్తించి మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే పేద కుటుంబానికి చెందిన దళిత విద్యార్థి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరో విద్యార్థి అక్షయ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని, అతనికి అవసరమైన మెరుగైన వైద్య చికిత్సతో పాటు మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
ఘటనకు బాధ్యులైన వసతి గృహ వార్డెన్‌తో పాటు సంబంధిత అధికారులపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం రుజువైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతి చెందిన విద్యార్థి హర్షవర్ధన్ కుటుంబానికి కనీసం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై సమగ్ర రివ్యూ, ఆడిట్ నిర్వహించాలని, ప్రమాదకర భవనాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరారు. హాస్టళ్లలో మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి వసతి గృహాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విద్యార్థి సంఘాల నాయకులను హాస్టళ్లు, పాఠశాలల్లోకి అనుమతించకుండా తీసుకొచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే సంఘాలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు.
మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యతను విస్మరించి కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారని చంద్రశేఖర్ యాదవ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులకు మెరుగైన విద్య, వసతులు కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధానాలను కూటమి ప్రభుత్వం అవలంబిస్తోందని ఆరోపించారు.
సెట్టూరు ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ హాస్టళ్లలో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, సెట్టూరు మండల అధ్యక్షులు నవీన్, నాయకులు హరీష్, చరణ్, రెడ్డి సాహిద్, రఫీ, శేఖర్, గౌస్, రాఘవ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
పున్నమి ప్రతినిధి

