పున్నమి న్యూస్ ప్రతినిధి: (ఆగస్టు 24)
పులివెందుల: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో అంతరిక్ష సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని జేఎన్టీయూ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. శేష మహేశ్వరమ్మ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పులివెందుల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “వికసిత్ భారత్ కోసం అంతరిక్ష సాంకేతికత” అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కె. శేష మహేశ్వరమ్మ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 విజయాన్ని పురస్కరించుకుని జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతలో సైన్స్, అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పులు, వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిష్కారాలు కనుగొనే దిశగా యువత నూతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిర అభివృద్ధిపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ యు. శ్రీనిత, భౌతిక శాస్త్ర విభాగాధిపతి ఎన్. శివరామిరెడ్డి, డాక్టర్ ఎం. ఓబుల్ రెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

