*సీతారామ ప్రాజెక్టు శిలాఫలకం సాక్షిగా…*
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీరు ఎప్పుడు?*
శిలాఫలకం ప్రశ్న కు సమాధానం ఉందా?*
*భూక్యా వీరభద్రం*
*సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ* *సభ్యులు*
*వైరా డివిజన్ కార్యదర్శి*
ఖమ్మం జిల్లా బ్యూరో గాండీవం దినపత్రిక ఆగస్టు 21
పోరాటాల చరిత్రను గుర్తుచేస్తున్న శిలాఫలకం… ప్రభుత్వాల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్న రైతులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి కోసం సీపీఐ(ఎం) నాయకత్వంలో జరిగిన పోరాటాలకు సీతారామ ప్రాజెక్టు చరిత్ర ఒక నిదర్శనం. ఖమ్మం మాజీ ఎంపీ, ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రం గారి నాయకత్వంలో గోదారి జలాలు సాగునీటి సాధన కోసం దుమ్ముగూడెం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా “మహాప్రస్థానం” పాదయాత్ర నిర్వహించారు.
సాగునీటి కోసం జరిగిన ఆ పోరాటాల ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు అందుతుందనే ఆశ రైతుల్లో ఏర్పడింది.
కాలక్రమంలో రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకం సీతమ్మ ప్రాజెక్టుగా, అనంతరం సీతారామ ప్రాజెక్టుగా రూపాంతరం చెందింది. పేర్లు మారాయి… ప్రభుత్వాలు మారాయి… ముఖ్యమంత్రులు మారారు… కానీ రైతుల సాగునీటి కల మాత్రం పూర్తిగా నెరవేరలేదు.
నిధుల కోసం “చలో అసెంబ్లీ” పాదయాత్ర
దుమ్ముగూడెం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడంతో ఖమ్మం నుంచి “చలో అసెంబ్లీ” పాదయాత్ర కూడా నిర్వహించాల్సి వచ్చింది.
ఆ సాగునీటి ఉద్యమంలో నేటి వ్యవసాయ శాఖ మంత్రి కూడా రైతులు, ఉద్యమకారులతో కలిసి అడుగులో అడుగు వేసి నడిచారు. నాడు సాగునీటి కోసం రోడ్డుపై నడిచిన ఆ అడుగులు, నేడు సీతారామ ప్రాజెక్టు శిలాఫలకం ముందు నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి.
నాడు రోడ్డుపై నడిచిన కాలినడక…
నేడు శిలాఫలకం సాక్షిగా ఒక ప్రశ్నగా మారింది!
ప్రాజెక్టుకు సరిపడా నిధులు ఎందుకు కేటాయించడం లేదు?
ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు?
రైతుల పొలాలకు సాగునీరు ఎప్పుడు అందుతుంది?
*వెయ్యి మంది రైతులతో మరోసారి పాదయాత్ర*
సాగునీటి సమస్య పరిష్కారం కోసం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు గారి నాయకత్వంలో సుమారు 1,000 మంది రైతులతో రైతు పాదయాత్ర నిర్వహించారు.
ఈ పాదయాత్రలు కేవలం రహదారులపై సాగిన ప్రయాణాలు కాదు. రైతుల సాగునీటి హక్కు కోసం జరిగిన ప్రజా పోరాటాలకు ప్రతీకలు.
అయితే ఇన్ని పోరాటాలు జరిగినా సీతారామ ప్రాజెక్టు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
ప్రభుత్వాలు మారాయి… ముఖ్యమంత్రులు మారారు… సమస్య మాత్రం అలాగే ఉంది!
రెండు పార్టీల ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు. వారిలో ఇద్దరు ముఖ్యమంత్రులు తమ పదవీకాలంలోనే మరణించారు. అయినా సీతారామ ప్రాజెక్టు పరిస్థితిలో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదు.
శంకుస్థాపన జరిగిన నాటి నుంచి 21 సంవత్సరాలు గడిచాయి. ప్రాజెక్టు పేర్లు మారాయి. అంచనాలు మారాయి. ప్రభుత్వాలు మారాయి. కానీ రైతుల పొలాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించే లక్ష్యం మాత్రం ఇంకా నెరవేరలేదు.
*నిర్వాసితుల కన్నీళ్లు… రైతుల ఎదురుచూపులు*
ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు నేటికీ పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. తమ భూములను ప్రభుత్వానికి అప్పగించిన కుటుంబాలు న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.
మరోవైపు ప్రాజెక్టు కాలువలు పూర్తికాక రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు.
భూములు ఇచ్చిన నిర్వాసితులకు పూర్తి పరిహారం లేదు…
కాలువలు పూర్తికాక రైతులకు సాగునీరు లేదు…
అరకొర నిధులతో పనులు సాగుతున్నాయి…
మరి సీతారామ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది?
*శిలాఫలకం ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది*
నేడు సీతారామ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తే అక్కడ కనిపిస్తున్న శంకుస్థాపన శిలాఫలకం ఒక చరిత్రను మాత్రమే చెప్పడం లేదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతను కూడా గుర్తు చేస్తోంది.
*నాడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?*
నాడు చేసిన శంకుస్థాపన ఏమైంది?
నాడు రైతులతో కలిసి నడిచిన అడుగులు ఏమయ్యాయి?
నేడు ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నిధులు ఎందుకు రావడం లేదు?
శిలాఫలకం ముందు నిలబడిన ప్రతి రైతు మనసులో ఇదే ప్రశ్న.
సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సాగునీరు అందించాలంటే సీతారామ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేయాలి. పెండింగ్‌లో ఉన్న కాలువల నిర్మాణాలను వేగవంతం చేయాలి. అవసరమైన మేరకు నిధులు కేటాయించాలి. నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహారం అందించాలి.
శంకుస్థాపనలతో కాదు…
పూర్తయిన ప్రాజెక్టులతోనే రైతుల జీవితాల్లో మార్పు వస్తుంది!
పాదయాత్రల్లో వేసిన ప్రతి అడుగు ఒక పోరాట చరిత్ర…
రైతుల పొలాల్లోకి వచ్చే ప్రతి నీటి చుక్క ఆ పోరాటానికి విజయ చిహ్నం!
అందుకే ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్ధితో వ్యవహరించి సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయించి, పనులను వేగవంతం చేసి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతుల పొలాలకు సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోంది.
*పోరాటాల ద్వారానే సాగునీరు సాధ్యం…*
రైతుల ఐక్యతే బలం
సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగించాలని శిలాఫలకం చెబుతుంది
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు గుర్తుచేస్తుంది


