*ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
————————–
జనగామ, ఆగష్టు 17,పున్నమి ప్రతినిధి :
ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధికారులను ఆదేశించారు.
సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా *(259)* అర్జీలను *కలెక్టర్* స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్ లో లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు.
*ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి*
జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ కు చెందిన నల్ల సుజాత, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సహాయం కొరకు మనవి చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు.
ఇటిక్యాలపల్లి గ్రామం, బచ్చన్నపేట మండలానికి చెందిన సుంకె రాములమ్మ, తన పది గుంటల భూమికి సర్వే నిర్ణయించి, హద్దు రాళ్లు పాతించారని, కానీ తన భూమి పక్కన ఉన్న వారు వాటిని తీసేయడం జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసియున్నారు.
పెద్దమడ్డూర్ గ్రామం, దేవరుప్పుల మండలానికి చెందిన గనుపాక సునీత, తాను నిరుపేద కుటుంబానికి చెందినదని, ఈ మేరకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరని ప్రార్థిస్తూ ఆర్జీ ద్వారా కోరారు.
పాలకుర్తి గ్రామం, పాలకుర్తి మండలానికి చెందిన మామిండ్ల రాణి, తాము పేదవారమని, రేషన్ కార్డులో వచ్చే బియ్యం మాత్రమే తమకు ఆధారమని, కావున రేషన్ కార్డులో తమ పేర్లను యాడ్ చేయగలరని, రేషన్ కార్డు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించనైనది.
మీదికొండ గ్రామం, ఘనపూర్ (స్టేషన్) మండలానికి చెందిన గాదెర ఎల్లయ్య, తాము నిరుపేద కుటుంబం అని, రోజూ వారి కూలి పని చేసుకుంటామని, పంట రుణం మాఫీ కాలేదని, ఈ మేరకు పంట రుణం మాఫీ చేయుట కోసం దరఖాస్తును సమర్పించినారు.
ఈ ప్రజావాణిలో డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చిన కోట్యా నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



