ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
డా.బిఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీ ఆర్ఎస్) కార్యక్రమం అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్ లో జరిగింది.ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్,జాయింట్ కలెక్టర్ వై ఖోమ్. నైడియా దేవి, డీఆర్వో వి.సుబ్బారావు, పీజీఆర్ఎస్ ఎస్డీసీ డి.అచ్యుత కుమారి, డీఆర్డీఏ పీడీ డి.రాంబాబు, డ్వామా పీడీ రామ్ గోపాల్, తదితరులతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు అర్జీలు స్వీకరించారు. భూ రికార్డు ఆన్ లైన్ లో నమోదు,రీ సర్వే, భూ ఆక్రమణలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పారిశుధ్యం, మురికి కాలువలకు పుడికతీత, ఇంటిస్థలం, గృహం, పింఛను, సదరం సర్టిఫికెట్, రోడ్లు మంజురు వంటి అంశాలపై మొత్తం 216 అర్జీలు అందాయి. ఈ అర్జీలను సంబంధిత అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ప్రతివారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నమోదైన అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యతతో పరిష్కరించాలని స్పష్టం చేశారు. వివిధ శాఖలో నమోదైన అర్జీల పట్ల సంబంధిత అధికారులు అధిక ప్రాధాన్యత ఇచ్చి, తప్పనిసరిగా నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు,కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ లు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


