తుర్కయంజాల్‌లో అక్రమ నిర్మాణాల జోరు.. పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు?
ఆదిభట్ల: ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా షెడ్లు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిర్మాణాలు చేపట్టే ముందు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కొందరు నిబంధనలను పక్కనపెట్టి పనులు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణాలు ప్రారంభమైన వెంటనే అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో తనిఖీలు ఎందుకు జరగడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అనుమతులు లేని నిర్మాణాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో ట్రాఫిక్, పార్కింగ్, డ్రైనేజీ, రహదారి విస్తరణ వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ నిర్మాణాలు చేపడుతున్న వారికి ఇబ్బందులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి వెసులుబాటు ఎందుకు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు తుర్కయంజాల్, తొర్రూర్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ప్రతి నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అనుమతించిన ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరుగుతోందా? అనే అంశాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి.



