వాటర్ ఫిల్టర్ కోసం నిర్మించిన షెడ్డు ధ్వంసం
గ్రామ పంచాయతీ స్థలంపై వివాదం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్
మల్కిజ్‌గూడ, ఆగస్టు 14: మల్కిజ్‌గూడ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ఉచితంగా వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని స్థలంలో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు కోసం గురువారం షెడ్డు నిర్మించినట్లు గ్రామస్థులు తెలిపారు.
అయితే, అనంతరెడ్డి, కొలం శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తులు ఆ స్థలం తమదేనని పేర్కొంటూ నిర్మించిన షెడ్డును ధ్వంసం చేసి తొలగించినట్లు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ స్థలం గ్రామ కంఠం భూమిలో భాగమని, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజల అవసరాల కోసం వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడానికి షెడ్డు నిర్మించామని వారు పేర్కొన్నారు.
ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన పనులకు ఆటంకం కలిగించడం సరికాదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని, గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్మించిన షెడ్డును ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు కోరుతున్నారు.
వాటర్ ఫిల్టర్ ఏర్పాటు పనులను త్వరితగతిన పునఃప్రారంభించి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
Uploaded Video:






