రంగంపేట, ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి IAS సూచించారు. రంగంపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన “కిసాన్ మేళా–రైతన్న మీకోసం” కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కోరారు. డ్రిప్, స్ప్రింక్లర్లకు సబ్సిడీపై దరఖాస్తులు స్వీకరించి రంగంపేట మండలాన్ని సాచురేషన్ మోడ్‌లో కవర్ చేస్తామని తెలిపారు. పంట బీమా రైతులకు రక్షణ కవచమని, అర్హులైన రైతులు తప్పనిసరిగా బీమా చెల్లించాలని సూచించారు. నీటిని కుటుంబ బడ్జెట్‌లా పొదుపుగా వినియోగించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి కోరారు. అనంతరం చండ్రేడు–పెదరాయవరం గ్రామాల్లో రైతుల పొలాలను పరిశీలించి డ్రోన్ పిచికారీ, నేల పరీక్ష విధానాలను అధికారులు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Uploaded Video:


