నాగర్ కర్నూల్ జిల్లాలలో ఎల్‌ఐసీ ఏజెంట్ల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్)కు అనుబంధంగా పనిచేస్తున్న భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ సంఘం (బ్లియాస్) నిరంతరం పోరాటం చేస్తోందని బ్లియాస్ సౌత్ జోనల్ జనరల్ సెక్రటరీ మలిశెట్టి బాలస్వామి అన్నారు. ఏజెంట్ల హక్కులను సాధించడంతో పాటు వారి సంక్షేమం కోసం బ్లియాస్ మరింత బలమైన ఉద్యమాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బ్లియాస్ యూనియన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖిల భారత ఈసీ మెంబర్ ఆర్. రాములు, హైదరాబాద్ డివిజన్ జనరల్ సెక్రటరీ భాను ప్రకాష్, జడ్చర్ల బ్రాంచ్ అధ్యక్షుడు శోభన్ బాబుతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ భారత కార్మిక ఉద్యమంలో బీఎంఎస్ 70 సంవత్సరాలుగా స్థిరమైన, ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతోందన్నారు. త్యాగం, తపస్సు, బలిదానం అనే భావనలను కార్మికుల్లో పెంపొందిస్తూ వారి హక్కుల కోసం బీఎంఎస్ నిరంతరం పోరాడుతోందని తెలిపారు.1955 జూలై 23న జాతీయవాది, ప్రముఖ కార్మిక నాయకుడు దత్తోపంత్ ఠేంగ్డే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారతీయ మజ్దూర్ సంఘ్‌ను స్థాపించారని ఆయన వివరించారు. అప్పటి నుంచి నేటి వరకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం బీఎంఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ సంఘం (బ్లియాస్) 1999లో కేరళలో ట్రేడ్ యూనియన్స్ యాక్ట్–1926 కింద కేంద్ర యూనియన్‌గా రిజిస్టర్ అయిందని బాలస్వామి తెలిపారు. అనంతరం దాని కార్యకలాపాలను విస్తరిస్తూ సౌత్ సెంట్రల్ జోన్‌లో కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బీఎంఎస్ సహకారం, పర్యవేక్షణతో బ్లియాస్ పనిచేస్తోందని తెలిపారు.ఎల్‌ఐసీ ఏజెంట్ల సంక్షేమానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాల్లో బ్లియాస్ కీలక పాత్ర పోషించిందన్నారు. ముఖ్యంగా గ్రాట్యుటీని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంలో యూనియన్ కృషి చేసిందని తెలిపారు.అదేవిధంగా క్లా బ్యాక్ కమిషన్ నిర్ణయాన్ని రద్దు చేయించే విషయంలో ఫైనాన్స్ మినిస్ట్రీతో చర్చలు జరిపి ఏజెంట్ల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేశామని చెప్పారు. ఇన్సూరెన్స్‌పై జీఎస్‌టీ మినహాయింపు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కీలక చర్చలు జరిపినట్లు వివరించారు.ఆల్ క్లబ్ మెంబర్స్‌కు క్వాలిఫైయింగ్ రిలాక్సేషన్ సాధించడంలో కూడా బ్లియాస్ కృషి చేసిందన్నారు. 2024లో ఎల్‌ఐసీ ఏజెంట్లకు సంబంధించిన ట్రైనింగ్, మెంబర్‌షిప్, బ్రిగేడ్‌షిప్ అలవెన్స్ పెంపు కోసం యూనియన్ విశేషంగా కృషి చేసిందని తెలిపారు.ఎల్‌ఐసీ ఏజెంట్లు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను యూనియన్ తన సమస్యగా భావించి పరిష్కారం కోసం పోరాడుతుందని బాలస్వామి హామీ ఇచ్చారు. ఏజెంట్లకు న్యాయం జరిగే వరకు బ్లియాస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏజెంట్లు సంఘటితంగా ఉండి తమ హక్కుల సాధన కోసం యూనియన్‌కు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
నూతన అడహాక్ కమిటీ ఏర్పాటు:* సమావేశం అనంతరం నాగర్‌కర్నూల్ యూనియన్‌కు నూతన అడహాక్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా కారువంగ పాపులు, ప్రధాన కార్యదర్శిగా పసుపుల లక్ష్మయ్య, ట్రెజరర్‌గా కుంభం ప్రకాష్ గౌడ్‌లను నియమించారు.ఈ సమావేశంలో యూనియన్ నాయకులు సుఖ జీవన్ రెడ్డి, శ్రీనివాసులుతో పాటు ఎల్‌ఐసీ ఏజెంట్లు ప్రతాప్ రెడ్డి, ఆంజనేయులు, సుధాకర్ గౌడ్, హకీం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.




