బద్రాద్రి కొత్తగూడెం, చుంచుపల్లి,మండలం, ఆగస్టు,5 (పున్నమి ప్రతినిధి)
రామవరం గ్రామంలో చేపడుతున్న తాగునీటి పైప్‌లైన్ పనులు వర్షాకాలంలో కొనసాగుతుండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారిని తవ్వడంతో వర్షపు నీరు గుంతల్లో నిలిచి బురదగా మారింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.
ప్రత్యేకించి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బురదలో నడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు కూడా రహదారిపై జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తగిన హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను వేగంగా పూర్తి చేసి, రహదారిని వెంటనే పునరుద్ధరించాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు



