విద్యార్థుల కోసం ఆదర్శంగా నిలిచిన హెచ్ఎం దురిశెట్టి రాజశేఖర్
పాఠశాలకు టీవీ, విద్యా పరికరాలు.. ఫెన్సింగ్, గార్డెన్, పెయింటింగ్‌తో నూతన రూపు
ఉమ్మడి ఆదిలాబాద్‌లో తొలి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు విశేష కృషి
ఆసిఫాబాద్, ఆగస్టు 3 (పున్నమి రిపోర్టర్): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వ నిధులపై ఆధారపడాల్సిన అవసరం లేదని, సేవాభావం ఉంటే ప్రభుత్వ బడులను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దవచ్చని జనకాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దురిశెట్టి రాజశేఖర్ నిరూపిస్తున్నారు.
జనకాపూర్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం ఆయన తన సొంత నిధులతో టీవీతో పాటు పలు విద్యా పరికరాలను సమకూర్చారు. అంతేకాకుండా పాఠశాల ఆవరణలో ఫెన్సింగ్ ఏర్పాటు, గార్డెన్ అభివృద్ధి, గోడలకు ఆకర్షణీయమైన పెయింటింగ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు స్వయంగా ముందుకు వచ్చి ఖర్చు చేయడం విశేషం. దీంతో పాఠశాల పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా మారి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడింది.
ప్రభుత్వ బడిపై విశ్వాసానికి నిదర్శనం
గతంలో ఈదులవాడ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే తొలి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ఆయన విశేష కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై తనకున్న విశ్వాసాన్ని చాటుతూ తన సొంత కుమార్తెను కూడా అదే పాఠశాలలో చేర్పించి ఇతర ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచారు.
ప్రజల ప్రశంసలు
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న దురిశెట్టి రాజశేఖర్ సేవలు అభినందనీయమని గ్రామస్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు కొనియాడుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యా వ్యవస్థకు స్ఫూర్తిగా నిలుస్తారని వారు పేర్కొంటున్నారు


