ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ తొలిమెట్టు: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
వైసీపీ నాయకులకు విషయ పరిజ్ఞానం లేదని విమర్శ
అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని జగన్ కు హితవు
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 31. ( పున్నమి ప్రతినిధి )
ఒకటో తేదీన జరగబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేయడమే కాకుండా, ఈ ప్రాంత అభివృద్ధికి ఒక మోడల్‌గా నిలవబోతోందని అన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో ‘ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన ప్రాంతం’ అనే ముద్ర తొలగిపోయి, ‘అభివృద్ధికి చిరునామా’గా మారబోతోందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని లలితకుమారి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికి, జాతికి అంకితం చేసేందుకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరుస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి, ప్రధానికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. 11 సీట్లకు పరిమితమైనా జగన్ అబద్ధపు ప్రచారాలు మానలేదని ధ్వజమెత్తారు. తన హయాంలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చెందింది అని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సహకారంతో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు నాంది పడిందనే వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని గుర్తుచేశారు.
వైసీపీ నాయకులకు విషయ పరిజ్ఞానం లేదని, నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ఉన్న తేడా కూడా తెలియకుండా మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రిగా కనీసం సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడితే ప్రజలు వినే అవకాశం ఉంటుందని, ఇకనైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని జగన్‌కు ఎమ్మెల్యే లలితకుమారి హితవు పలికారు.


