ట్రాఫిక్ భద్రతపై అవగాహనకు ఓఎస్‌జీ ఫౌండేషన్ ముందడుగు
ఓఎస్‌జీ ఫౌండేషన్ రూపొందించిన ట్రాఫిక్ నియమాల పోస్టర్‌ను ఆవిష్కరించిన భీమిలి సీఐ దివాకర్ – రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు నియమాలు పాటించాలని సూచన
భీమిలి – ఆనందపురం పున్నమి ప్రతినిధి, జూలై,23
విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భీమిలి పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఓఎస్‌జీ ఫౌండేషన్ రూపొందించిన ట్రాఫిక్ నియమ నిబంధనల అవగాహన పోస్టర్‌ను గురువారం భీమిలి పోలీసు స్టేషన్‌లో సీఐ దివాకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐ దివాకర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా ఉండటం, ట్రాఫిక్ సంకేతాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను కూడా కాపాడుకోవచ్చని సూచించారు.
ప్రజల్లో ట్రాఫిక్ క్రమశిక్షణ పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా ఓఎస్‌జీ ఫౌండేషన్ ఈ అవగాహన పోస్టర్‌ను రూపొందించిందని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓఎస్‌జీ ఫౌండేషన్ అధ్యక్షుడు శివ దళాయి, అరవింద్, ఎం. రవి, ఎస్‌ఐలు సురేష్, లలిత, ఆదిత్య, గౌరీతో పాటు పోలీసు సిబ్బంది, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.


