నెల్లూరు జిల్లా పున్నమి ( ప్రతినిధి )విజయ్
ఆత్మకూరు గురుకుల బాలికల పాఠశాలలో ‘శక్తి టీం’ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. విద్యార్థులు చెడు నడవడికకు దూరంగా ఉండి లక్ష్యాలను సాధించాలని సీఐ పిలుపు.
ఆత్మకూరు : బాలికల తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలలకు మంచి పేరు తెచ్చేలా విద్యార్థినులు నడవడిక ఉండాలని ఆత్మకూరు సిఐ జి గంగాధర్ పేర్కొన్నారు. శక్తి టీం సభ్యులు సునీత ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అతిథిగా పాల్గొన్న సీఐ గంగాధర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అన్నా, తమ్ముడు, తండ్రి, బాబాయ్, మామయ్య అనే వరుస భేదాలు లేకుండా పోయాయి అన్నారు. ఆడపిల్లలు ఎవరితోనూ చనువుగా ఉండకూడదని తెలిపారు.పాత స్నేహాలు, ప్రేమ వంటి వ్యవహారాల జోలికి అస్సలు వెళ్లకూడదని హెచ్చరించారు. ఇందుకు ఆయన అనుభవంలో జరిగిన కొన్ని సంఘటనలను విద్యార్థినులకు వివరించారు. ప్రేమించడం, లేచిపోవడం వంటి వ్యవహారాలు చేస్తే జీవితం నాశనమవుతుందని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో ఏడు నుంచి 10 తరగతి చదివే ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారన్నారు. ఫోన్లో పరిచయమయ్యే వారిని నమ్మవద్దని సూచించారు. జీవితంలో ఇదొక్కటే ప్రధానం కాదని, కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని సాధించుకోవాలన్నారు. మీరు విద్యావంతులైతే రేపు ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదురైనా మీ కాళ్ళపై మీరు నిలబడి బ్రతకగలిగే భరోసా ఉంటుందన్నారు. మీపై నమ్మకం ఉంచి ఎక్కడెక్కడి నుంచో ఇంత దూరం చదువుకునేందుకు పంపించిన తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. ఆయన వెంట ఎస్సై జంపానీ కుమార్, ప్రిన్సిపల్ రూత్, వారి సిబ్బంది పాల్గొన్నారు.


