ఖమ్మం జులై
(పున్నమి న్యూస్ )
రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరం క్రాస్ రోడ్, జగన్నాథపురం వద్ద నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఖమ్మం–బోనకల్ ప్రధాన మార్గంలో ఆంక్షలు విధిస్తున్నట్లు వైరా ఏసీపీ సాదుల సారంగపాణి తెలిపారు.
రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. సభకు వచ్చే రైతులు, ప్రజలు, అధికారులు, మీడియా వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
ఖమ్మం నుంచి పందిళ్లపల్లి, చింతకాని, బోనకల్ మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే వాహనాలు నేలకొండపల్లి మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. అలాగే బోనకల్ నుంచి ఖమ్మం వైపు వచ్చే వాహనాలు వైరా మార్గం ద్వారా రావాలని తెలిపారు.
ధంసలాపురం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపం నుంచి బోనకల్ బ్రిడ్జి వరకు సాధారణ వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నుంచి సభకు వచ్చే వీఐపీ వాహనాలు కోదాడ, నేలకొండపల్లి, ముదిగొండ మండలంలోని వల్లపురం మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని కోరారు.


