గుండి వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఇంకా అసంపూర్తి
15 గ్రామాల ప్రజలకు నిత్య యాతన – పనులు పూర్తి చేయకపోతే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం: డీవైఎఫ్ఐ హెచ్చరిక
ఆసిఫాబాద్, జూలై 8:
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని గుండి గ్రామం వద్ద గుండి వాగుపై నిర్మాణంలో ఉన్న హై-లెవెల్ బ్రిడ్జి పనులు దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతూనే ఉండటం పట్ల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007లో నాబార్డ్ నిధులతో మంజూరైన ఈ వంతెనను 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉండగా, 2026 వచ్చినా పనులు ఇంకా అసంపూర్తిగానే ఉండటం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
ఆయన మాట్లాడుతూ, మొదట ఈ వంతెన నిర్మాణానికి సుమారు ₹8.50 కోట్లు అంచనా వ్యయం నిర్ణయించగా, సంవత్సరాల తరబడి ఆలస్యం కారణంగా వ్యయం ఇప్పుడు ₹14.40 కోట్లకు పెరిగిందన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం 11 పిల్లర్లు మాత్రమే నిర్మించారని, వాటిపై కాంక్రీట్ స్లాబ్‌లు వేయాల్సి ఉండగానే పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రజల అవసరాలపై దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు.
గుండి వాగుపై శాశ్వత వంతెన లేకపోవడంతో గుండి గ్రామంతో పాటు దాని పరిసర ప్రాంతాల 15 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కార్తీక్ తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు గ్రామాలకు జిల్లా కేంద్రంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయని, ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతున్నారని అన్నారు. సరైన వంతెన లేక స్థానికులు నాటు పడవలు, థర్మాకోల్ తెప్పలపై ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన సమయంలో గర్భిణీలు, వృద్ధులు, ప్రమాద బాధితులను వాగు దాటించేందుకు సరైన మార్గం లేక ప్రాణాల మీద ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంటోందని ఆయన వాపోయారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయంలో, ప్రజలు రోజువారీ అవసరాల కోసం ప్రయాణించే సమయంలో ఈ వాగు ప్రాణాంతకంగా మారుతోందన్నారు. ఎండాకాలంలో స్థానికులు తాత్కాలికంగా మట్టి రోడ్లు వేసుకున్నప్పటికీ, వర్షాలు మొదలైతే అవి కొట్టుకుపోతున్నాయని, ఇదే పరిస్థితి ఏళ్లుగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇంతకాలం వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం పెరిగిందని డీవైఎఫ్ఐ నాయకులు తెలిపారు. గతంలోనే గ్రామస్తులు “వంతెన లేకపోతే – ఓటు లేదు” అంటూ ఎన్నికల బహిష్కరణకు దిగినా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించలేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లు పదేపదే హామీలు ఇచ్చినా అవి మాటలకే పరిమితమయ్యాయని ఆరోపించారు.
ఇకనైనా గుండి వాగుపై వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని, లేనిపక్షంలో 15 గ్రామాల ప్రజలను కలుపుకొని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ హెచ్చరించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రజాప్రతినిధులకు రాజకీయంగా తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని కూడా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టికానంద్, ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్‌కుమార్, గ్రామ నాయకులు రాహుల్, శంకర్, దిలీప్, సావిత్రి, సోనీ, హారిక, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


