ప్రజాదర్బార్ – 55 అర్జీల స్వీకరణ. మండలంలో 540కి గాను 490 సమస్యలకు పరిష్కారం.
రెంటచింతల, జూలై (పున్నమి ప్రతినిధి)04: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 55 అర్జీలను నేరుగా స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం మండలాల వారీగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నాం. ప్రజలు తమ సమస్యలను నేరుగా మా దృష్టికి తెస్తున్నారు. వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం” అని తెలిపారు.మండల పరిధిలో ఇప్పటి వరకు 540 అర్జీలు రాగా, వివిధ కారణాలతో 50 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, మిగిలిన 490 సమస్యలను అధికారులు పరిష్కరించారని ఎమ్మెల్యే వెల్లడించారు. పెండింగ్ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.“ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీతనం ఉండాలి. సమస్య పరిష్కారమయ్యాక అర్జీదారుడికి సమాచారం ఇవ్వాలి. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు” అని అధికారులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.దీప్తి, ఎంపీడీవో స్వరూపా రాణి, టీడీపీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, నాయకులు గొంటు సుమంత్ రెడ్డి, మున్నా ప్రభురాజు, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, మందలపు హనిమిరెడ్డి,బోడపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


