ఫార్మాసిటీ భూముల వ్యవహారంలో రైతుల పక్షాన సీపీఎం నేతల ఆందోళన
మేడిపల్లి గ్రామం: ఫార్మాసిటీ కోసం భూములు సేకరించిన రైతుల పొలాల వద్దకు వచ్చిన ప్రభుత్వ అధికారులను రైతులు, సీపీఎం నాయకులు అడ్డుకుని తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు సాగు చేస్తున్న రైతుల పొలాల్లో పంటలను ఎలా ధ్వంసం చేస్తారని అధికారులను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సీపీఎం పార్టీ యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాల్సిన ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు, వ్యవసాయ కూలీలకు పునరావాస ప్యాకేజీ కింద అందించాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని కోరారు.
చట్ట ప్రకారమే భూముల సేకరణ జరగాలని, రైతుల హక్కులకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన అన్నారు. అలాగే కోర్టు కేసుల్లో ఉన్న రైతులకు పట్టా సౌకర్యం కల్పించి, పాసుబుక్కులు మంజూరు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఇప్పటి నుంచి రైతుల సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వ అధికారులు రైతుల భూముల వద్దకు రావద్దని హెచ్చరించారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడతామని సీపీఎం నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు సిద్ధం కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ సిద్ధం జంగయ్య, సింగం గుండాలు, సిద్ధం రవి, ఎరుకల శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




