ప్రైవేట్ విద్యా దోపిడీ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి – గిరిజన సంఘాల డిమాండ్
జూన్ 29 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
భద్రాద్రి కొత్తగూడెం :
జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం (GVS) ఆధ్వర్యంలో, గిరిజన సంఘాలు మరియు విద్యార్థి సంఘాల మద్దతుతో శాంతియుత ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను కార్పొరేట్ వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ఫీజులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, యూనిఫాంలు, షూస్‌ను బలవంతంగా విక్రయించడం, నకిలీ CBSE పేర్లతో తల్లిదండ్రులను మోసం చేయడం, చిన్నారులపై NEET, IIT, లాంగ్‌టర్మ్ వంటి కోచింగ్‌ల పేరుతో అధిక మానసిక ఒత్తిడి కలిగించడం వంటి అంశాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
అదేవిధంగా విద్యా హక్కు చట్టం (RTE) ప్రకారం 25 శాతం ఉచిత ప్రవేశాలను కచ్చితంగా అమలు చేయాలని, రెగ్యులర్ MEOలను నియమించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు మౌలిక వసతులు, ఉచిత యూనిఫాంలు, బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, స్కూల్ బ్యాగుల బరువుపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేసి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్, భద్రాద్రి జిల్లా JAC వైస్ చైర్మన్ వీరు నాయక్, GVS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రాంబాబు నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, సేవాలాల్ సేన LHPS జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు బద్రు నాయక్ ,LHPS జిల్లా ఇంచార్జి కుషాల్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా నాయకులు భరత్ నాయక్, GVS ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ నాయక్, BGPS జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ నాయక్, జిల్లా నాయకులు లాలూ నాయక్, రైతు సంఘం నాయకులు తేజవత్ కృష్ణ నాయక్, సతీష్ కుమార్, గురూ ప్రసాద్‌తో పాటు పలువురు గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



