ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్19 ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసుల్లో నలుగురు నిందితుల పట్టివేత – రూ.2.31 లక్షల సొత్తు రికవరీ
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు సర్కిల్ పరిధిలో వరుసగా ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా ఆరు మండలాల పరిధిలో మొత్తం 19 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి విలువైన సామగ్రిని అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.2.31 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఆత్మకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్ తెలిపారు.గురువారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ గంగాధర్ కేసు వివరాలను వెల్లడించారు. ఇటీవల ఆత్మకూరు సమీప ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి చోరీలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ట్రాన్స్ఫార్మర్‌ను ధ్వంసం చేసి చోరీకి యత్నిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారని చెప్పారు.విచారణలో నిందితులు గత కొంతకాలంగా ఆత్మకూరు సర్కిల్ పరిధితో పాటు సమీపంలోని పలు మండలాల్లో కూడా ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు వెల్లడించారు. మొత్తం 19 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి చోరీలకు పాల్పడటంతో విద్యుత్ శాఖకు సుమారు రూ.2.43 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు.నిందితుల నుంచి చోరీ చేసిన సామగ్రిలో రూ.2.31 లక్షల విలువైన వస్తువులను రికవరీ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మిగిలిన వస్తువుల స్వాధీనం కోసం విచారణ కొనసాగుతోందన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లపై దాడులు చేయడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటమే కాకుండా రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. నిందితులను త్వరితగతిన పట్టుకోవడంలో పోలీసు బృందం సమన్వయంతో పనిచేసిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్సై జంపాని కుమార్, ఎస్సై శ్రీనివాసులు రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


