Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

మరణానికీ మించిన మానవత్వం..

* నలుగురికి ప్రాణం పోసిన అమరజీవి పుచ్చకట్ల సుధాకర్ యాదవ్


* బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కంచి పరమేశ్వర రెడ్డి

ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లి గ్రామానికి చెందిన యువకుడు పుచ్చకట్ల సుధాకర్ యాదవ్ అకాల మరణం చెందినప్పటికీ, అవయవ దానం ద్వారా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఘటన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటనపై శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ యాదవ్ నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించబడ్డారు. తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ, ఆయన కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో అవయవ దానానికి ముందుకొచ్చారు. వైద్యులు సుధాకర్ గుండె, కాలేయం, రెండు మూత్రపిండాలను సేకరించి తిరుపతికి తరలించగా, వాటితో నలుగురు రోగులకు పునర్జన్మ లభించింది.ఈ విషయం తెలుసుకున్న కంచి పరమేశ్వర రెడ్డి శనివారం స్వయంగా ఉమ్మాయపల్లిలోని సుధాకర్ నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.బాధిత కుటుంబ పరిస్థితిని గమనించి తక్షణ సహాయంగా రూ.20 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తమకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదని సుధాకర్ కుటుంబం తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం. మరణం తర్వాత కూడా మనం జీవించి ఉండే ఏకైక మార్గం అవయవదానం” అని పేర్కొన్నారు.మన శరీర అవయవాలు మరొకరికి ప్రాణం పోయగలవని గుర్తించి ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల సానుకూలంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సుధాకర్ వంటి యువకుల త్యాగం సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తుందని కొనియాడారు.మరణించినా తన అవయవాల ద్వారా నలుగురికి జీవం పోసిన సుధాకర్ యాదవ్ “ప్రాణదాత”గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని గ్రామస్తులు భావోద్వేగంగా పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *