గాజువాక–యారాడ జనవరి (పున్నమి ప్రతినిధి)
గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో మరోసారి ఆటో ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లోడుతో వెళ్తున్న ఆటోకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పిల్లర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఇదే మార్గంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. కొండ ప్రాంతమైన యారాడ మార్గంలో వరుస ప్రమాదాలతో ఆటో ప్రయాణాలు అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రహదారి భద్రత, వాహనాల తనిఖీలపై అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.



