హైదరాబాద్ డిసెంబర్
(పున్నమి ప్రతి నిది)
ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉన్నతాధికారులతో కలిసి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏర్పాట్ల పురోగతిని వివరిస్తూ, పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని, దాదాపు అన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు.
2035 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర వివరాలను ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రపంచానికి తెలియజేయనున్నట్లు చెప్పారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతి, వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిపై రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో చర్చించనున్నట్లు వెల్లడించారు.
రేపు 7వ తేదీ సాయంత్రం ముందస్తుగా డ్రైవ్ రన్ నిర్వహించి, పూర్తిస్థాయి ప్రణాళికాబద్ధంగా ఈ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రపంచానికి ఒక రోల్ మోడల్‌గా నిలిచేలా ప్రభుత్వం నిర్వహించనుందని మంత్రి పేర్కొన్నారు. డిసెంబర్ 8న 2034 – 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
ఇండిగో విమానాల రద్దు ప్రభావం గ్లోబల్ సమ్మిట్‌పై ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వస్తున్న అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఇంతటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేసి… ప్రపంచ దేశాలకు మన రాష్ట్ర ఔన్నత్యం, సామర్థ్యాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా చాటుదాం అని మంత్రి పిలుపునిచ్చారు.


