రోజురోజుకే పెరుగుతున్న ఆర్థిక అంతరాలు తగ్గింపునకు సహకార వ్యవస్థ బలోపేతమే పరిష్కార మార్గమని ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ చైర్మన్ జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ముస్లిం వీధి, శ్రీదేవి మార్కెట్, జైశ్రీరామ్ జంక్షన్ నందు బ్యాంకు 58వ నూతన శాఖను ఈనెల 28 వ తేదీన ప్రారంభించనున్న సందర్భంగా బ్యాంకు ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సమాజంలో కోటీశ్వరులు జాబితా పెరుగుతుంటే మరోవైపు సామాన్యుల ఆర్థిక స్థితిగతులు రోజురోజుకు దిగజారడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ దేశంలో పేద మధ్యతరగతి వర్గ ప్రజల హార్దిక అవసరాలకు సహకార, అర్బన్ బ్యాంకులు బాసటగా నిలుస్తున్నాయన్నారు. విశాఖ నగరంలో 1916 ఫిబ్రవరి 5వ తేదీన కార్యకలాపాలు ప్రారంభించిన ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ నేడు తెలుగు రాష్ట్రాల్లో 57 బ్రాంచ్ ల ద్వారా బహుళ రాష్ట్రాల అర్బన్ బ్యాంకుగా ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. భారతదేశ సహకార చిత్రపటంలో నాన్ షెడ్యూల్డ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో అతిపెద్దదిగా, సహకార సూత్రాలను శ్రీకరణ శుద్ధిగా పాటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. డిపాజిటర్లను సభ్యులుగా చేర్చడం ద్వారా బ్యాంకు పాలకవర్గం నిర్ణయాల్లో వారిని కూడా భాగస్వాములను చేస్తూ నూతన ఒరవడి తో ముందుకు సాగుతుందన్నారు. వాణిజ్య బ్యాంకుల నుంచి ఎటువంటి తోడ్పాటు పొందలేని ప్రజలకు విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రత్యామ్నాయ బ్యాంకుగా గుర్తింపు సాధించింది అన్నారు.
58వ బ్రాంచ్ గా అమలాపురం శాఖను ప్రారంభించుకోవడంతో పాటు త్వరలో హైదరాబాదు, విశాఖపట్నం లలో నూతన శాఖలను ప్రారంభించడం ద్వారా బ్రాంచ్ ల సంఖ్య 60 కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెవి సత్యనారాయణమూర్తి తెలిపారు. అమలాపురం ప్రాంతంలో సహకార ఉద్యమ పునాదులను ప్రతిష్టపరిచే ఉద్దేశంతో బ్యాంకు అమలాపురం బ్రాంచ్ ద్వారా రానున్న ఐదేళ్లలో రూ.110 కోట్లు ఆర్థిక కార్యకలాపాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అమలాపురం ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదల, ఈ ప్రాంత అభివృద్ధిలో ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు తన వంతు పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.రామకృష్ణమూర్తి, డైరెక్టర్ సి.కృష్ణ మోహన్ రావు, సీఈవో వి.వి.బి.వరలక్ష్మి, జోనల్ మేనేజర్ ఠాగూర్, మేనేజర్ ఎ.శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.


