తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నాటు సారా తయారు చేసినా, రవాణా చేసినా, అమ్మకాలు జరిపినా వెంటనే కాల్ సెంటర్ 14405 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్న సమీక్ష సమావేశంలో ఆమె – ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, అందువల్ల ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు.
నాటు సారా నిర్మూలన – ప్రజారోగ్యం కోసం ప్రభుత్వ మిషన్ పని చేస్తోందని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ, నాటు సారా సేవించడం వల్ల వ్యక్తి ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని, ముఖ్యంగా శరీరంలోని ప్రధాన అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. నాటు సారాను నిర్మూలించేందుకు ప్రభుత్వం “నవోదయం 2.0” అనే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందని, దీని లక్ష్యం ప్రజారోగ్య పరిరక్షణతో పాటు ఆర్థిక, సామాజిక శ్రేయస్సు ను కాపాడడమేనని ఆమె తెలిపారు. జిల్లాలో 19 మండల స్థాయి కమిటీలను , 240 గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నాటు సారా తయారీ, నిల్వ, రవాణా లేదా విక్రయాలపై ఎవరైనా సమాచారం అందించిన యెడల 14405 నంబరుకు కాల్ చేయవచ్చని, ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎక్సైజ్ శాఖ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
నవోదయం 2.0 కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటివరకు 313 అవగాహన సమావేశాలు నిర్వహించినట్లు, 63 దత్తత అధికారులు నియమించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య తెలిపారు. మండల, గ్రామ స్థాయి కమిటీలు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, నాటు సారా నిర్మూలన దిశగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య, ఆర్డీవోలు కృష్ణ నాయక్, రాణి సుస్మిత, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. వి. వి. ఎస్. మూర్తి, డిఎస్‌వో వి. పార్వతి, డిఎంహెచ్‌వో కె. వెంకటేశ్వరరావు, డి ఐ పీఆర్వో కే లక్ష్మీ నారాయణ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బి. శశాంక, ట్రైబల్ ఆఫీసర్ కే ఎన్ జ్యోతి, ఎక్సైజ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


