అవినీతిని అరికట్టడం ద్వారా రూ.200కోట్లు ఆదాచేశాం
శాసనసభ్యలంతా వీవర్స్ శాలను అధ్యయనం చేయండి
అసెంబ్లీలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @అమరావతి:
చేనేత సొసైటీలకు కొంతశాతం యూనిఫాం తయారీ ఆర్డర్ ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు శాసనసభ్యులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. 5వరోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో భాగంగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ… గతంలో ఆప్కోకు ఆర్డర్ ఇస్తే సొసైటీలు సకాలంలో యూనిఫాం సరఫరా చేయలేకపోయారు. చేనేతలను ప్రోత్సహించే అంశంపై గతంలో కూడా పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ఇందుకోసం స్ట్రక్చరల్ చేంజ్ రావాలి. ప్రభుత్వ టెండరులో సొసైటీలు ఎలా పోటీపడాలనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. దాదాపు 50 నియోజకవర్గాల్లో చేనేతలు ఉన్నారు. యూనిఫామ్ విషయంలో మార్కెట్ ధరల పోటీని ఎలా ఎదుర్కోవాలనే విషయమై సభ్యులందరం కూర్చుని మాట్లాడాలి. ఇందుకోసం నలుగురైదురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. చేనేత వృత్తిని అందరం కలసికట్టుగా కాపాడాలి, అదే సమయంలో సరైన విధంగా సరఫరా జరిగేలా కూడా చూడాలి. అందరం కలసి చర్చిస్తే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. కమిట్ మెంట్ తో చేనేతలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన బాధ్యత ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వదేశీ గురించి చెప్పారు. ఇందులో చేనేత కీలకమైన పాత్ర పోషిస్తుందని మంత్రి చెప్పారు.
2019-24 నడుమ స్కూలు విద్యార్థులకు యూనిఫాం కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు కొన్ని ఫిర్యాదులు అందాయి. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాం, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెస్ట్ క్వాలిటీతో మంచి ఫ్యాబ్రిక్, డిజైన్ తో విద్యార్థులకు అత్యుత్తమమైన కొత్త యూనిఫాం ఇచ్చాం. గతంలో కంటే డ్యూరబిలిటీ, బ్రీతబిలిటీ ఎక్కువ ఉండే దుస్తులు ఇచ్చాం, బాయ్స్, గర్ల్ కు ఒకే విధమైన యూనిఫాం ఇచ్చాం. పాఠశాల విద్యశాఖలో అయిదేళ్లలో వెయ్యికోట్లు ఆదాచేయాలని అధికారులను ఆదేశించాం. టెండరు విధానం పారదర్శకంగా నడిపించాలని చెప్పాం. దీంతో గతఏడాది సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట విద్యార్థులకు అందించే కిట్స్, గుడ్లు, చిక్కీలలో రూ.200 కోట్లు ఆదా చేశాం. ఇదే విధానాన్ని అమలుచేసి అయిదేళ్లలో రూ. వెయ్యికోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా చేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
చేనేతలను ప్రోత్సహించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్నాం. మంగళగిరిలో వీవర్స్ శాల ద్వారా చేనేత కార్మికులకు 40నుంచి 50శాతం ఆదాయం పెంచామని మంత్రి లోకేష్ చెప్పారు. డిజైన్లు, మార్కెటింగ్ పై టాటా టనేరాతో ఒప్పందం చేసుకున్నాం. మా వంతుగా చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తున్నాం. గౌరవ సభ్యులు సమయం ఉన్నపుడు వీవర్స్ శాలను సందర్శించాలి. చేనేతలకు మెరుగైన ఉపాధి, ఆదాయం వచ్చేలా మార్కెట్ లింక్ చేసే అంశాన్ని అధ్యయనం చేయాలి. మేం మూడున్నరేళ్లుగా వీవర్స్ శాల ద్వారా చేనేతల ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ వ్యవస్థలో ఇంకా దళారులు ఉన్నారు, చేనేతలను కాపాడుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అమలుచేయాల్సి ఉంది. చేనేతలు వృత్తిపరంగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు.


