విషాదంలోనూ నేత్రదానం చేసిన తల్లిదండ్రులు
బిక్కవోలు, సెప్టెంబరు 29 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు కొత్తపేటకు చెందిన కల్లేపల్లి శివరామకృష్ణ (26) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 21న గోకవరంలో శుభకార్యానికి వంట పనికి వెళ్లిన శివరామకృష్ణ, 23న రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలభద్రపురం–కానేడు రోడ్డుపై తుఫాన్ కారణంగా మోటార్‌బైక్ అదుపుతప్పి జారిపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా అనపర్తి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
కుమారుడి మృతితో విషాదంలో ఉన్న తల్లిదండ్రులు మానవత్వాన్ని చాటుతూ అతడి రెండు నేత్రాలను లకంసాని విరీన్ మానస్ రెడ్‌క్రాస్ ‘ఐ’ బ్యాంక్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, కాకినాడకు దానం చేశారు. ఈ నేత్రాలను ఇద్దరు అంధులకు చూపు అందించేందుకు వినియోగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేత్రదానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రుల నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.


