ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వైరా ఎగ్జిట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవరపల్లి నుంచి ఖమ్మం వైపు వస్తున్న ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. వెంటనే స్పందించిన ప్రయాణికులు, ఇతర వాహనదారులు శ్రమించి డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి బయటకు తీశారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో హైవేపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.



