సైబర్ జాగృతి దివస్‌లో విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన
మీర్ఖాన్పేట్ ప్రభుత్వ పాఠశాలలో గ్రీన్ ఫార్మా సిటీ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
మీర్ఖాన్పేట్, ఆగస్టు 5: సైబర్ నేరాల పట్ల ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న సైబర్ జాగృతి దివస్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం మీర్ఖాన్పేట్ ప్రభుత్వ పాఠశాలలో సైబర్ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి. సత్యనారాయణ, ఎస్ఐ సునీల్ కుమార్, పోలీసు సిబ్బంది సైదులు పాల్గొని విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సురక్షితంగా వినియోగించే విధానాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు.
విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ లింకులు, నకిలీ వెబ్సైట్లు, OTP మోసాలు, QR కోడ్ స్కామ్‌లు, సోషల్ మీడియా అకౌంట్ల భద్రత, బలమైన పాస్‌వర్డ్‌ల వినియోగం, వ్యక్తిగత సమాచారం గోప్యత వంటి అంశాలను ఉదాహరణలతో వివరించారు. అలాగే ఇటీవల పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రత్యేకంగా హెచ్చరించారు.
అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు లేదా డబ్బులు పంపాలని కోరే అభ్యర్థనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, బ్యాంకు వివరాలు, OTPలు, పాస్వర్డ్లు ఎవరికీ వెల్లడించవద్దని విద్యార్థులకు సూచించారు. ఏదైనా సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహిస్తున్న సైబర్ జాగృతి దివస్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సైబర్ భద్రతకు సంబంధించిన పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.



