కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ప్రధానోపాధ్యాయుడు, విద్యావేత్త గొర్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో మంగళవారం ప్రశాంతంగా, ఏకగ్రీవంగా జరిగాయి. సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. విద్యార్థుల తల్లిదండ్రులు చేతులెత్తి సభ్యులను ఎన్నుకోగా, అనంతరం కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్పర్సన్లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
చైర్మన్‌గా జె.శివానంద, వైస్ చైర్‌పర్సన్‌గా ఎస్.మౌలాని ఎన్నికయ్యారు. మొత్తం 15 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. నూతన కమిటీ సభ్యులను పలువురు అభినందించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ఫొటోలు, వీడియోల రూపంలో నమోదు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారులకు పంపించారు.
రెండేళ్ల కాలపరిమితితో ఏర్పాటైన ఈ కమిటీలో 75 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు, మిగిలిన 25 శాతం మంది ఉపాధ్యాయులు, పంచాయతీ సభ్యులు, ఏఎన్ఎం, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు ప్రాతినిధ్యం కల్పించారు. సభ్యుల్లో 50 శాతం మహిళలు ఉండాలనే నిబంధనను అమలు చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కమిటీ సభ్యులను ఎంపిక చేసినట్లు వెంకటస్వామి తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించిన తల్లిదండ్రులు, విద్యాశాఖ, పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


