విశాఖపట్నం జిల్లా,ఆనందపురం, ఆగస్టు 7 (పున్నమి ప్రతినిధి):
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం ఆనందపురం మండలంలోని వేములవలస పంచాయతీలో ఉత్సాహంగా కొనసాగుతోంది. బూత్‌లు 89, 90 పరిధిలో ప్రతిరోజూ సుమారు 30 ఇళ్లను సందర్శిస్తూ పార్టీ నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో వేములవలస పంచాయతీ ఉపసర్పంచ్, తెలుగుదేశం యువ నాయకుడు కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్, క్లస్టర్ ఇన్‌చార్జ్ మీసాల సత్యనారాయణ, యూనిట్ కన్వీనర్ గొర్లె సంతోష్, అట్టాడ బంగారు నాయుడు తదితరులు పాల్గొని ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అర్హతలు, ప్రయోజనాలు, ప్రజలకు అందుతున్న సేవల గురించి ఇంటింటికీ వెళ్లి వివరించారు.
ఈ సందర్భంగా కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులతో పోలిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రతి అర్హ కుటుంబానికి చేరవేయడమే లక్ష్యంగా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి కూడా విశేష ఆదరణ, సానుకూల స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
గ్రామస్థులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆసక్తి చూపుతూ నాయకులను ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకోవడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ సందేశాన్ని చేరవేస్తామని పార్టీ నాయకులు వెల్లడించారు.


