విశాఖపట్నం, ఆగస్టు 25, 2026: గాజువాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్. వాసు నాయుడు ఆదేశాల మేరకు షీలా నగర్‌లోని MPEV EM పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు వివిధ సామాజిక సమస్యలు, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గాజువాక పోలీస్ స్టేషన్ WSI జి. హరిచందన గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళలను గౌరవించడం, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకుండా ఉండటం, మహిళలు మరియు బాలికల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వివరించారు.అదేవిధంగా, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు, అనుమానాస్పద యాప్‌లు, సోషల్ మీడియా ఖాతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరైనా OTP, పాస్‌వర్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తెలియజేయరాదని సూచించారు. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని విద్యార్థులకు వివరించారు.మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని WSI హరిచందన గారు విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్‌కు అలవాటు పడటం వల్ల విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతాయని తెలిపారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించడం, సరఫరా చేయడం లేదా వినియోగించడం గురించి సమాచారం తెలిసినట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, సమస్యలను దాచిపెట్టకుండా ధైర్యంగా తెలియజేయాలని సూచించారు. బాలికలు మరియు విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాల్లో పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.ప్రస్తుత కాలంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో వాటిని బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు, మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని, ఆన్‌లైన్‌లో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు.గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు మరియు యువతకు నేరాల నివారణ, సైబర్ భద్రత, డ్రగ్స్ నియంత్రణ మరియు మహిళల భద్రతపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.


