విజయవాడ, జూలై 24: తెలుగు కవిత్వంలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో “కవిత ఏ 24 గంటలు” పేరుతో వినూత్న చిత్రకవితా పోటీని నిర్వహించనున్నట్లు సంస్థ జాతీయ అధ్యక్షురాలు జి .ఈశ్వరీ భూషణం ,జాతీయ కార్య నిర్వాహక అధికారి నూక సంపత్ లు ఒక ప్రకటనలో తెలిపారు . ఈ పోటీలో భాగంగా నిర్వహకులు ఒక చిత్రాన్ని ప్రకటిస్తారు . ఆ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని కవులు 24 గంటల్లోపు తమ స్వీయ కవితను రచించి పంపాల్సి ఉంటుంది . ఒక్క కవికి ఒక్క కవిత మాత్రమే అనుమతించబడుతుంది . కవిత 20 పంక్తులకు మించకుండా ఉండాలని , తెలుగు అక్షరాలతో టైప్ చేసి వాట్సాప్ ద్వారా మాత్రమే పంపాలని సూచించారు . కవిత పూర్తిగా స్వీయ సృజన అయి ఉండాలని , ఇతరుల రచనలను అనుకరించినవి , అనువాదాలు , కృత్రిమ మేధ సహాయంతో రూపొందించిన రచనలు పరిగణలోకి తీసుకోబోమని తెలిపారు . ప్రతి కవితకు శీర్షికతో పాటు పాస్‌పోర్ట్ పరిమాణంలోని చిత్రపటాన్ని జతచేసి , “ఈ కవిత పూర్తిగా నా స్వీయ రచన” అనే స్వీయ ధృవీకరణను తప్పనిసరిగా పంపాలని పేర్కొన్నారు.
అన్ని కవితలను రచయిత వివరాలు గోప్యంగా ఉంచి న్యాయనిర్ణేతలు పరిశీలిస్తారు. చిత్రానుసరణ, భావగాధత, కవితా శిల్పం, భాషా సౌందర్యం, సృజనాత్మకత ఆధారంగా అత్యుత్తమ 25 కవితలను ఎంపిక చేసి, ఆయా కవులకు ప్రత్యేక ప్రశంసపత్రంతో పాటు “కవిత ఏ 24 గంటలు-ఉత్తమ కవి” గుర్తింపును ప్రదానం చేయనున్నారు. పాల్గొన్న మిగిలిన ప్రతి కవులకు అభినందన ప్రశంసపత్రం అందజేయబడుతుందని తెలిపారు.
శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కళారత్న కత్తిమండ ప్రతాప్ కుమార్ సారధ్యంలో తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాలు పరిరక్షణలో భాగంగా శ్రీ శ్రీ కళావేదిక నిరంతరం పని చేస్తుందన్నారు . ఇందులో భాగంగా డిజిటల్ మీడియా ద్వారా ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు . జాతీయ కార్య నిర్వాహక అధికారి నూక సంపత్ పర్యవేక్షణలో ఈ పోటీకి డా. టి. పార్థసారధి, డా. బాలచంద్ర సాదే, డా. నాయకంటి నరసింహశర్మ, చంద్ర వెంకటేశ్వరరావు, డా. కావూరి శ్రీనివాస శర్మ, మశేకర్ నాగజ్యోతి, డాక్టర్ పుల్లేటి కుర్తి శ్రీను బాబు, నల్లా భాగ్యలక్ష్మి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. శ్రీ శ్రీ కళావేదిక నిర్వాహకులుగా సభ్యైళ్ళ మహాలక్ష్మి రెడ్డి, లావణ్య, సువర్ణ జోషి, సాహాొ సంధ్య, సంతోషిణి ఈ పోటీలో పాల్గొనదలచిన కవులు మరిన్ని వివరాల కోసం 94400 42520, 98664 81047 నెంబర్లను సంప్రదించాలని శ్రీ శ్రీ కళావేదిక నిర్వాహకులు కోరారు.



