*ఏపీ రైతన్నలకు రుణాలను మంజూరు చేసి ఆపన్నహస్తాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వం*
*చిత్తూరు పార్లమెంటు దగ్గుమళ్ళ ప్రసాదరావు*
*లోక్ సభలో దీర్ఘకాలిక వ్యవసాయ ఆస్తుల సముపార్జన కోసం రుణ మద్దతు వివరాలను కోరిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ*
*సానుకూలంగా స్పందించిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రిత్వ శాఖ*
*వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్ నాథ్ ఠాగూర్
పున్నమి ప్రతినిధి,చిత్తూరు (ఢిల్లీ)-జూలై 21
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (AI F) ద్వారా ఎన్డీఏ సర్కార్ అన్నదాతలకు అండగా నిలుస్తోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు.రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు కూడా రుణాలను మంజూరు చేసి ఆపన్నహస్తాన్ని అందిస్తోందని ఆయన తెలియజేశారు.
శీతాకాల పార్లమెంటు సమావేశాలకు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.., మంగళవారం లోక్ సభలో దీర్ఘకాలిక వ్యవసాయ ఆస్తుల సముపార్జన కోసం రుణ మద్దతు అనే అంశానికి సంబంధించిన వివరాలను ఎన్డీఏ సర్కార్ను కోరారు. ఇందులో ముఖ్యంగా..వ్యవసాయ యంత్రాలు,నీటిపారుదల నిర్మాణాలు మరియు పంట కోత అనంతర మౌలిక సదుపాయాలతో సహా దీర్ఘకాలిక వ్యవసాయ ఆస్తుల సృష్టి లేదా సముపార్జన కోసం ప్రభుత్వం రైతులకు రుణ మద్దతును అందిస్తుందా? గత మూడు సంవత్సరాలలో అటువంటి పథకాల కింద మద్దతు పొందిన లబ్ధిదారుల సంఖ్య ఎంత..? అలాగే గత మూడు సంవత్సరాలలో వివిధ ప్రభుత్వ మద్దతు గల రుణ పథకాల కింద దీర్ఘకాలిక వ్యవసాయ ఆస్తుల కోసం మంజూరు చేసిన రుణ పరిమాణం వివరాలు..? చిన్న, సన్నకారు, కౌలు రైతులు ప్రత్యేకంగా దీర్ఘకాలిక వ్యవసాయ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ఎదుర్కొంటున్న లోటుపాట్లు, ఇబ్బందుల పై ప్రభుత్వం ఏమైనా అంచనా వేసిందా? రైతులకు రుణ లభ్యతను పెంచడానికి తీసుకున్న సవరణ చర్యల వివరాలు ఏమిటి? అన్న అంశాలకు సంబంధించి వివరాలను తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.
దీనికి భారత ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించిందనీ, కేంద్ర మంత్రి రామ్ నాథ్ ఠాగూర్ వివరాలను వెల్లడించినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.. ఢిల్లీ పార్లమెంటు ప్రాంగణంలో తెలియజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశంలో తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (AIF) కింద 3% వార్షిక వడ్డీ రాయితీని, గరిష్టంగా 9% వడ్డీ రేటు పరిమితో గరిష్టంగా 7 సంవత్సరాల వరకు, అర్హత కలిగిన రుణగ్రహీతలకు 2 కోట్ల వరకు రుణ గ్యారెంటీ కవరేజీని అందిస్తోందన్నారు..
ఈ మద్దతు అర్హులైన లబ్ధిదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. అంటే రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), సహకార సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు (PACS), స్వయం సహాయక సంఘాలు (SHGలు), వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు మొదలైనవారు, దీని ద్వారా పంట కోత అనంతర మౌలిక సదుపాయాలు, నీటిపారుదల నిర్మాణాలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, గోదాములు, సైలోలు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్-హౌస్‌లు, సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు, అస్సేయింగ్ సౌకర్యాలు, సోలార్ పంపులు, ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు వంటి వ్యవసాయ ఆస్తులను సృష్టించవచ్చునని పేర్కొన్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో, దేశవ్యాప్తంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (AIF) కింద 1,27,931 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు. దీని ద్వారా ₹46,480.10 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 4,015 మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రంలో ₹1,759.08 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. గత మూడు సంవత్సరాలలో AIF కింద లబ్ధిదారులు, మంజూరు చేసిన రుణాల సంవత్సరం వారీ, రాష్ట్రం వారీ వివరాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు జిల్లా వారీ వివరాలను తనకు లిఖితపూర్వక అందించినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడించారు.
చిన్న , సన్నకారు రైతులతో సహా రైతులు దీర్ఘకాలిక పంట కోత అనంతర వ్యవసాయ మౌలిక సదుపాయాలను సృష్టించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాఖ నిరంతరం అంచనా వేస్తుంది. ఇందుకోసం వాటాదారులతో సంప్రదింపులు, ఆవర్తన సమీక్షలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్థిక సంస్థల నుండి అభిప్రాయాలను తీసుకుంటుంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (AIF) కింద సంస్థాగత రుణ లభ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హత కలిగిన కార్యకలాపాల జాబితా కింద ఇంటిగ్రేటెడ్ ప్రైమరీ & సెకండరీ ప్రాసెసింగ్, పుట్టగొడుగుల సాగు, హైడ్రోపోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్, PM-KUSUM కాంపోనెంట్-A మొదలైన అదనపు ఆచరణీయ వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేర్చడం ద్వారా ఈ పథకం పరిధిని విస్తరించారు. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల (PACS) గోదాము/వేర్‌హౌస్ ప్రాజెక్టులకు రుణ గ్యారెంటీ కవరేజీ కాలాన్ని 2+5 సంవత్సరాల నుండి 2+8 సంవత్సరాలకు పెంచారు. ఆన్‌లైన్ దరఖాస్తు, ప్రాజెక్ట్ పర్యవేక్షణ, రుణ సంస్థలతో అనుసంధానం, ఇతర ప్రభుత్వ పథకాలతో సమన్వయాన్ని సులభతరం చేయడానికి డిజిటల్ సింగిల్-విండో AIF పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు.. భారత ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తనకు అందించిన వివరాల్లో తెలియపరిచినట్లు ఆయన తెలిపారు.


