వైద్య సేవల మెరుగుదలకు మంత్రి దామోదరతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి భేటీ
హైదరాబాద్, జూలై 27: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారుల సమీక్ష సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ఆసుపత్రుల్లో అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత తదితర సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
దీనిపై మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, మెడికల్ కళాశాల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు.
వైద్య రంగ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు చేపడతామని సమావేశంలో మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.



