*రెవెన్యూ సేవలు వేగవంతం చేయాలి*
*జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి*
విజయనగరం, జిల్లా బ్యూరో రమణ సెప్టెంబర్ 08 : పున్నమి ప్రతినిధి
విజయనగరం జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్‌తో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఆర్వో సీహెచ్. సత్తిబాబు, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఆన్లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి పట్టాదారు పాస్బుక్ల పంపిణీ, ఈ–కేవైసీ, గుడ్ ఫర్ ప్రింటింగ్ (జీఎఫ్‌పీ), వెబ్‌ల్యాండ్ ప్రక్రియలను పరిశీలించారు. రీసర్వే, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ఫిర్యాదులు, వెబ్‌ల్యాండ్ మ్యుటేషన్లు, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మ్యుటేషన్లు, 22(ఏ) దరఖాస్తుల పరిష్కారంపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
రీసర్వేకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి, భూ రికార్డుల డిజిటలైజేషన్‌ను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
పట్టాదారు పాస్బుక్ల పంపిణీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని, ఈ–కేవైసీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్టోబర్ నెలలో 81 గ్రామాలు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. వెబ్‌ల్యాండ్ మ్యుటేషన్లు, 22(ఏ) దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


