అశ్వారావుపేట, జూలై
(పున్నమి ప్రతి నిధి)
అశ్వారావుపేట పట్టణానికి ప్రాణాధారంగా ఉన్న చారిత్రాత్మక దొంతికుంట చెరువు ఆధునీకరణ పనులపై వివాదం నెలకొంది. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి, వాకింగ్ ట్రాక్ నిర్మాణం వల్ల చెరువు విస్తీర్ణం తగ్గిపోతోందని ఆరోపిస్తూ ఆయకట్టు రైతులు, స్థానిక ప్రజలు ఇరిగేషన్ డీఈని నిలదీశారు.
రైతులు, ప్రజల ఆరోపణల ప్రకారం, చెరువు చుట్టూ 8 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ కారణంగా దాదాపు ఐదు ఎకరాల మేర చెరువు విస్తీర్ణం తగ్గిపోతోందని తెలిపారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిన పనులు, చెరువు సామర్థ్యాన్ని తగ్గించేలా ఉన్నాయని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో చెరువులోకి వచ్చే సహజ నీటి కాలువలపై జరిగిన ఆక్రమణలను తొలగించకుండా, చెరువు చుట్టూ ఎత్తైన కట్ట నిర్మించడం వల్ల వర్షపు నీరు చెరువులోకి చేరకుండా శాసనవాటికతో పాటు పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
అలాగే జంగారెడ్డిగూడెం రోడ్డు వైపు నుంచి వచ్చే తూములు పూడిపోవడం, వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటంతో గౌడ్ బజార్, మంగళ బజార్, సంత మార్కెట్ ప్రాంతాల్లో స్వల్ప వర్షానికే నీరు నిలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
చెరువులోకి నీరు వచ్చే మార్గం (ఇన్‌ఫ్లో), బయటకు వెళ్లే మార్గం (అవుట్‌ఫ్లో) సక్రమంగా లేకపోవడం, రెవెన్యూ–ఇరిగేషన్ శాఖలు నిర్వహించిన సర్వే వివరాలను బహిర్గతం చేయకపోవడంపై కూడా రైతులు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా రైతులు, స్థానిక ప్రజలు పలు డిమాండ్లు చేశారు. వాకింగ్ ట్రాక్ వద్ద భారీ పైపులు లేదా తోరలు ఏర్పాటు చేసి వర్షపు నీరు చెరువులోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, ఇన్‌ఫ్లో కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, పూడిపోయిన తూములను వెంటనే శుభ్రం చేయాలని, ఉమ్మడి సర్వే మ్యాప్‌ను ప్రజల ముందుంచాలని కోరారు.
ఇప్పటికైనా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించి లోపాలను సరిదిద్దాలని, లేకపోతే రాబోయే వర్షాకాలంలో అశ్వారావుపేట పట్టణం ముంపునకు గురైతే అందుకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని స్థానికులు హెచ్చరించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఉన్నత ఇరిగేషన్ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని రైతులు, పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేశారు.



