రంగాపూర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పున్నమి న్యూస్
02 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, రంగాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ అమరవీరులు, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గ్రామంలో దేశభక్తి నినాదాలు మార్మోగగా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
అదేవిధంగా జలాల్మియా పల్లెలో అశ్వల జయమ్మ, అండేకార్ నిర్మలలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన కుటుంబానికి చేరవేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ యాదగిరి, వార్డు సభ్యులు వలవోజు అశోక్ మలహోత్ర, అజయ్ బాస్, దివ్య, మనిత, పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, అంగన్వాడీ టీచర్లు శంకరమ్మ, సునీత, ఆశా వర్కర్ పద్మ, మహిళా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు అనసూయ, భాగ్యలక్ష్మి, వీబీకే విజయలత, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, చీదేడు మాజీ సర్పంచ్ రమాకాంత్ రెడ్డి, కోటి, బాల్‌రెడ్డి, కమలాకర్, పవన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం గ్రామ ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపాయి.







