న్యూఢిల్లీ, మే
దేశంలోని జాతీయ రహదారుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 17 జాతీయ రహదారులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని NH–163 పరిధిలోని యాదాద్రి–వరంగల్ సెక్షన్‌కు చెందిన 99.1 కిలోమీటర్ల రహదారిని కూడా ప్రైవేటుకు అప్పగించనున్నారు. ఈ మార్గంలో ఉన్న కోమళ్ల, కోమటిపల్లి టోల్ ప్లాజాల నిర్వహణ బాధ్యతలను కూడా సంబంధిత ప్రైవేటు సంస్థ చేపట్టనుంది.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికల ప్రకారం హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి మూడు చొప్పున హైవేలు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి రెండు చొప్పున, కర్ణాటక మరియు బీహార్ రాష్ట్రాల నుండి ఒక్కో జాతీయ రహదారిని ప్రైవేటుకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
హైవేల నిర్వహణలో మెరుగైన సేవలు, వేగవంతమైన అభివృద్ధి, నిర్వహణ వ్యయాల్లో తగ్గింపు లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.



