నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని వెంకటనారాయణపురంలో రాష్ట్ర మత్స్యకార సహకార సంఘం చైర్మన్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటించారు.
నెల్లూరు (కోవూరు): నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మత్స్యకారుల మధ్యకు వచ్చి వారి కష్టసుఖాలను తెలుసుకోవడం తమకు ఎంతో భరోసాను కల్పించిందన్నారు మత్స్యకారులు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని వెంకటనారాయణపురం మత్స్యకార గ్రామాన్ని ఆయన జనసేన నాయకులతో కలిసి సందర్శించడం మత్స్యకారులకు ఎంతో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందన్నారు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల.రాష్ట్ర మత్స్యకార సహకార సంఘం చైర్మన్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కి వెంకటనారాయణపురం గ్రామంలోని మత్స్యకారులు ఆనందోత్సాహాలతో సంప్రదాయ కోలాటంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బొమ్మిడి నాయకర్ గారు మత్స్యకారులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించి, ఎల్లప్పుడూ మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.మత్స్యకార సంఘం నాయకులు ప్రసాద్, హరి, ఆంజనేయులు మరియు గ్రామ పెద్దల ఆత్మీయ ఆహ్వానం మేరకు బొమ్మిడి నాయకర్ గారు జనసేన నాయకులతో కలిసి గ్రామాన్ని సందర్శించి మత్స్యకార కుటుంబాలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా తీసుకొచ్చిన జి.ఓ. నెం. 217ను అప్పట్లో పవన్ కళ్యాణ్ అడ్డంగా నిలచి తీవ్రంగా వ్యతిరేకించి, మత్స్యకార కుటుంబాల హక్కుల పరిరక్షణ కోసం అండగా నిలిచారని గుర్తు చేశారు.అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార భరోసాను రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచడం, సబ్సిడీపై డీజిల్ అందించడం, వలలు, టూ వీలర్లు, ఆటోలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. మత్స్యకార కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని బొమ్మిడి నాయకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గాదిరాజు జీవన్,ఆలియా, అలహరి సుధాకర్, ఉదయగిరి నాయకులు కాశీ తదితరులు పాల్గొన్నారు.


