భద్రాచలం: వార్షిక తనిఖీల్లో భాగంగా భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్ భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. సిబ్బంది విధుల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు నిరంతరం చర్యలు చేపట్టాలని డీఎస్పీ ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, బస్టాండ్, దేవాలయాల పరిసరాల్లో ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ 2.0లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, బ్లూకోల్ట్స్ వాహనాలతో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు. అనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న డీఎస్పీ.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్హెచ్ఓ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.





