పున్నమి ప్రతినిధి ,తిరుచానూరు జూలై 24
శ్రీ పద్మావతి అమ్మవారు (అలిమేలు మంగమ్మ) శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చి పై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. శుక్రవారంలో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఉత్సవర్లను వేంచేపుగా ఉద్యానవనానికి తీసుకెళ్లి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించిన వైభవంగా ఉంజల సేవ నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచ్చిపై కొలువు దీర్చి తిరుమాడా వీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఆలయ ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, మునిచంగల్రాయులు, ఇన్స్పెక్టర్ చలపతి ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


