ప్రభుత్వ భూమా..? HMDA స్థలమా..? అధికారులకే సస్పెన్స్..!
ORR పక్కన విలువైన భూములపై ఆక్రమణల ఆరోపణలు
ప్రైవేట్ కాలేజీలు, హోటళ్లకు అక్రమ రహదారుల ఏర్పాటుపై విమర్శలు
“మాకు కూడా క్లారిటీ లేదు” అంటున్న అధికారులు..!
పున్నమి న్యూస్
09 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో భూమి ఆక్రమణలపై స్థానికుల ఆగ్రహం
ప్రైవేట్ విద్యాసంస్థలు, హోటళ్లకు అక్రమ రహదారుల ఏర్పాటుపై అనుమానాలు
స్పష్టత ఇవ్వలేక చేతులెత్తేసిన అధికారులు..!
రంగారెడ్డి జిల్లా బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న విలువైన భూముల విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ భూమా..? లేక HMDA పరిధిలోని స్థలమా..? అన్న అంశంపై అధికారులకే స్పష్టత లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయల విలువ చేసే ఆ భూమిలో కొంతభాగం ఆక్రమణకు గురైందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం, బొంగులూరు ORR సమీపంలోని ఖాళీ భూమి గుండా కొందరు అక్రమంగా రోడ్డు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ విద్యాసంస్థలు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండానే ప్రభుత్వ లేదా HMDA భూమిని వినియోగిస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, ఆ భూమి అసలు ఏ శాఖ పరిధిలో ఉందోనే స్పష్టత లేదని అధికారులు చెప్పడం మరింత వివాదానికి దారితీస్తోంది. “అది ప్రభుత్వ భూమా..? HMDA స్థలమా..? రికార్డులు పరిశీలించాల్సి ఉంది” అంటూ మున్సిపల్ అధికారులు సమాధానం ఇవ్వడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రస్తుతం కోట్ల విలువ చేసే భూముల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణదారులు మరింత రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రభావశీలుల అండతోనే ఈ ఆక్రమణలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి అసలు భూమి యాజమాన్యంపై స్పష్టత ఇవ్వాలని, అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు, HMDA, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టి నిజానిజాలు బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
“ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భూమి విషయంలో స్పష్టత లేకపోవడం, అధికారులు బాధ్యత తప్పించుకోవడం ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తోంది.




