ఇంటింటికీ తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం పట్టణంలోని 27వ వార్డులో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడిన మంత్రి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనే రెండు లక్ష్యాలతో ముందుకు సాగుతోందన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా రహదారులు, తాగునీటి సదుపాయాలు, డ్రైనేజీలు, విద్య, వైద్య రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాలు, సహకారంతో రాష్ట్రాన్ని మరియు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు.
ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్థానికులు మంత్రిని ఆత్మీయంగా స్వాగతించి తమ సమస్యలు, అభిప్రాయాలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవెల్లి శివ, కూటమి పార్టీ నాయకులు, 27వ వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


