అనపర్తి, జూలై 31 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి నియోజకవర్గానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ.27 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సహాయం అందని వారు, ఇతర కారణాలతో వైద్యం చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు 385 మందికి రూ.3.79 కోట్ల మేర సహాయం అందించినట్లు చెప్పారు. ఇందులో 360 మందికి రీయింబర్స్మెంట్, 25 మందికి ఎల్ఓసీల ద్వారా సహాయం అందించామని, ఎల్ఓసీల విలువ సుమారు రూ.95 లక్షలు ఉందన్నారు. మరో 350 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.



