బుచ్చినాయుడు కండ్రిగ ఆగస్ట్ 23
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు పల్లెనిద్ర, నైట్ హాల్ట్ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమై వారి స్థానిక సమస్యలు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు.
ఇందులో భాగంగా బి.ఎన్. కండ్రిగ సీఐ ఆధ్వర్యంలో తొట్టంబేడు ఎస్ఐ బోనుపల్లి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. బోనుపల్లి సున్నితమైన గ్రామం కావడంతో పోలీసు అధికారులు ప్రత్యేకంగా పర్యటించి గ్రామస్తులతో సమావేశమై వారి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించి, ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళలు–చిన్నారుల భద్రత, రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
జిల్లాలోని రేణిగుంట, చిట్వేల్, బాలాయపల్లి, వెంకటగిరి తదితర పోలీస్ స్టేషన్ పరిధుల్లోని గ్రామాల్లో కూడా అధికారులు పర్యటించి గ్రామస్తులు, గ్రామ పెద్దలతో సమావేశమై స్థానిక సమస్యలు మరియు శాంతిభద్రతల అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా సున్నితమైన గ్రామాల్లో ప్రత్యేక అప్రమత్తతతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలు సంయమనం పాటిస్తూ శాంతియుత వాతావరణానికి సహకరించాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.
ప్రజలకు పోలీసుల భద్రతా భరోసా కల్పించడం, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం, సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతలను పటిష్టంగా పర్యవేక్షించడం, నేరాల నివారణపై అవగాహన పెంచడం లక్ష్యంగా పల్లెనిద్ర, నైట్ హాల్ట్ మరియు అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతున్నాయి.

