ఖమ్మం పున్నమి ప్రతి నిధి
పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుత వానాకాలం సీజన్ 2025లో మొట్టమొదటి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలయపాలెం మండలం గోల్‌తండలో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి.లక్ష్మీ బాయి గారు, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, ఆర్డీవో నర్సింహారావు, ఆత్మ కమిటీ చైర్మన్ శివరామకృష్ణ, డిసిసిబి డైరెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్అ రెడ్డి అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గిన నేపథ్యంలో సీసీఐ ద్వారా పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ఏదైనా జరిగితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ప్రతి సీసీఐ కేంద్రంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రైతుల పొలాల వద్దే తేమ శాతం పరీక్షించేలా తేమ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. రైతులు ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం గురించి అవగాహన కల్పించాలని సూచించారు.
రాబోయే పార్లమెంట్ సెషన్‌లో పత్తి మద్దతు ధర పెంపుపై చర్చించి, రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,అధికారులు తెలిపారు.


