పున్నమి ప్రతినిధి తాళ్లపూడి / గోదావరి జిల్లాలో అక్రమంగా డీజిల్ తరలిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నుండి చట్ట విరుద్ధంగా డీజిల్ రవాణా చేస్తున్న లారీని అధికారులు పట్టుకున్నారు.
వివరాల ప్రకారం, నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతం నుంచి బయలుదేరిన లారీ, తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామం ఇసుక ర్యాంప్ వద్దకు చేరుకుని, అక్కడ లారీ నుంచి ట్రాక్టర్లలో డబ్బాల ద్వారా డీజిల్‌ను నింపుతున్నట్లు గుర్తించారు. ఈ చర్యలు పూర్తిగా అక్రమంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
లారీ పట్టుబడిన తర్వాత, అక్రమార్కులు దానిపై నకిలీ బిల్లులు సృష్టించినట్లు కూడా విచారణలో వెల్లడైంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న కొవ్వూరు ఎమ్మార్వో దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో, ఏఎస్ఓ మరియు సివిల్ సప్లై అధికారుల బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది.
దాడుల సమయంలో లారీతో పాటు డీజిల్ తరలించడానికి వినియోగించిన ట్రాక్టర్‌ను కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అక్రమ డీజిల్ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను బయటకు తేవడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఇటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Uploaded Video:


