విశాఖపట్నం, పున్నమి ప్రతినిధి (ఏప్రిల్ 18):
శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి చందనోత్సవం సందర్భంగా మీడియా పాసులను దినపత్రికలతో పాటు పిరియాడికల్స్‌కు కూడా జారీ చేయాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (ఎల్‌ఎన్‌ఏ) ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఎం. ఆబిశక్త్ కిషోర్‌ను కోరారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి, మీడియా పాసులు కేవలం కవరేజ్‌కే పరిమితం చేసి దర్శనానికి అనుమతి లేదనే ప్రచారం జరుగుతోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన కలెక్టర్, మీడియా పాసులు అందరికీ జారీ చేస్తామని, దర్శనం కోసం ప్రత్యేకంగా ఉచిత టికెట్లు కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు.
అక్రిడిటేషన్లు వెంటనే జారీ చేయాలి
ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో స్థానిక పత్రికలకు అన్యాయం జరుగుతోందని ఎల్‌ఎన్‌ఏ ఆరోపించింది. పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్లను తక్షణమే జారీ చేయాలని మరో వినతి పత్రంలో కోరింది. ఎంక్వైరీ కమిటీ రద్దు చేయాలి
నేషనల్ న్యూస్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన విచారణ కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. తప్పుడు ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదని పేర్కొంది. అక్రిడిటేషన్ కమిటీ మెజారిటీ సభ్యులకు కూడా దీనిపై అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరగా, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఎన్‌ఏ అధ్యక్షుడు పి. సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే గాజువాక అధ్యక్షుడు కె. పరశురాం, జాప్ జిల్లా అధ్యక్షుడు కె.ఎం. కీర్తనరావు, ఏఎస్‌ఎంఎన్‌ఐ మొల్లి కమల్ కుమార్‌తో పాటు పలువురు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




