
ఆత్మకూరు, జూలై 21 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మండలం జంగాలపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న దళిత రైతు కటారి శ్రీనయ్యకు చెందిన గడ్డివాము అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల విలువైన పశుగ్రాసం కాలిపోవడంతో రైతు కుటుంబం తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసింది.
స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే గడ్డివాము పూర్తిగా కాలిపోవడంతో పశువుల మేత కోసం నిల్వ ఉంచిన గడ్డి మొత్తం బూడిదైంది.
ఈ ఘటనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతు కటారి శ్రీనయ్య సోమవారం ఆత్మకూరు తహసీల్దార్ పద్మజా కుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. తాము పేద రైతులమని, పశువుల కోసం నిల్వ ఉంచిన గడ్డి పూర్తిగా దగ్ధమైందని, తిరిగి కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదని పేర్కొంటూ ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడేటి అశోక్, గంధం సిసింద్రీ, కటారి వెంకటేష్ తదితరులు రైతుకు మద్దతుగా పాల్గొన్నారు.

